చంద్రబాబు-భువనేశ్వరి కోడ్ ఉల్లంఘన..?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. విశాఖలో సిబిఐ పట్టుకున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. ఇందులో వైసీపీ నేతలే ఉన్నారంటూ టిడిపి విమర్శలు గుప్పించగా..దీనికి వైసిపి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ పైనే వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
విశాఖపట్నం డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ పై విచారణ జరపాలని వైసిపి నేత పేర్ని నాని అన్నారు. విశాఖ డ్రగ్ వ్యవహారంలో చంద్రబాబు,లోకేష్,పురందేశ్వరి, టిడిపి ముఖ్యుల పాత్రపై సీఈఓ కి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టిడిపి నేతలు ఈ డ్రగ్స్ తెప్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వైసిపి పై చేసిన ట్వీట్ ను తమ ఫిర్యాదులో జత చేశారు వైసీపీ నేతలు. దీనిపై లోతుగా విచారణ జరపాలని అభ్యర్థించారు.
సిబిఐ 25 వేల కిలోల మత్తు పదార్థాలను పట్టుకుందని, ఇందులో లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలియకుండానే చంద్రబాబు తమ పార్టీపై అభియోగాలు మోపటం సరికాదని అన్నారు పేర్ని నాని. చంద్రబాబు, పురందేశ్వరి బంధువులే డ్రగ్సు వ్యవహారంలో ఉన్నారని ఆరోపించారు నాని. గతంలో చంద్రబాబు అమరావతికి సింగపూర్ మంత్రిని తెచ్చారని ఆ మంత్రి సింగపూర్ జైల్లో ఉన్నారని గుర్తు చేశారు ఆయన. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారి పోతారని విమర్శించారు వైసీపీ నేత పేర్ని నాని. కోడు ఉన్న సమయంలో నిరాధార ఆరోపణలు చేయడం కూడా ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకునేలా ఈసీ నిబంధనలు చెబుతున్నాయని స్పష్టం చేశారు వైసీపీ నేత పేర్ని. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంగించారని ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. భువనేశ్వరి కోడ్ ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని సూచించారు అయన. తాము ఇప్పటికే ఈ అంశంపై సమాచారం సేకరిస్తున్నామని తగిన విధంగా స్పందిస్తామని సీఈవో వైసీపీ నేతలకు హామీ ఇవ్వటం కొసమెరుపు.