వైసీపీ మేనిఫెస్టోలో ఉండబోతున్న అంశాలివే..మేనిఫెస్టో తేదీ వాయిదా..!
సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో పై భారీ కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల మేనిఫెస్టోతో సీఎం జగన్ 151 సీట్లు గెలిచారు. అయితే ప్రస్తుతం తిరిగి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్. అందులో భాగంగా అద్దంకి సిద్దం సభలో త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తానని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చేసేవి మాత్రమే తాను చెబుతానని క్లారిటీ ఇచ్చారు.
జగన్.2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసామని చెప్పారు. దీంతో, ఈ సారి మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.రైతులకు రుణమాఫీ చేస్తారా..? లేక, ప్రస్తుతం ఇస్తున్న రైతు భరోసా మొత్తాన్ని రూ .20వేలకు పెంచుతారా? అనేది స్పష్టత రావాల్సి ఉండగా.. మహిళలకు 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేసారు ముఖ్యమంత్రి జగన్. తిరిగి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఆర్దికంగా చేయూత అందించేందుకు ప్రతీ ఏటా ఆర్దికంగా మేలు జరిగేలా కీలక నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
అదే విధంగా ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు హామీ ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటుగా ఈ సారి యువతకు సంబంధించి ఆసక్తికర హామీ ఉండబోతోందట. మేనిఫెస్టో ఈ నెల 20న ప్రకటించాలని ముహూర్తంగా ఖరారు చేయగా.. మేనిఫెస్టో ప్రకటన ప్రస్తుతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం కావడంతో వాయిదా పడినట్లు సమాచారం.వైసీపీ మేనిఫెస్టో తుది దశకు చేరుకుంది. జగన్ చెప్పాడంటే..చేస్తాడంతే అనే నమ్మకం పేరుతో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్న సీఎం జగన్.. మేనిఫెస్టోలో రైతులు,కార్మికులు, మహిళలు, వృద్ధులు, యువత,విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం.