2016లో గల్లంతైన విమానం..ఎనిమిదేళ్లకు వీడిన మిస్టరీ..!
8ఏళ్ల కిందటి ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం మిస్సింగ్ మిస్టరీ వీడింది. బంగాళా ఖాతం అడుగున విమాన శిథిలాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇందులో ప్రయాణించిన 29 మంది సజీవంగా లేరనేది దాదాపుగా క్లియర్ కట్ అయింది..
2016లో బంగాళాఖాతం మీదుగా 29 మందితో వెళ్తున్న విమానం జాడ మిస్ అయింది. అయితే అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఓ అంచనాకి వచ్చిన అధికారులు అన్వేషణ ప్రారంభించారు..నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించిన ఆటానమస్ యుటిలిటీ వెహికల్(AUV) ద్వారా చివరకు.. 8ఏళ్ల తర్వాత చెన్నై తీరానికి దాదాపు 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమానం శిథిలాలు కనుక్కున్నారు.టెక్నాలజీ ఉపయోగించి జరిపిన అన్వేషణలో పలు అంశాల పరిశీలన అనంతరం.. సముద్రం అడుగున కనిపించిన శిథిలాలు ఏఎన్-32వేనని అధికారులు తెలుసుకున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అసలు జూలై 22, 2016న ఏం జరిగింది..?
ఉదయం 8.30నిముషాల ప్రాంతంలో IAF ఆంటోనోవ్ An-32, చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. 3గం.తర్వాత అది గమ్యస్థానం అండమాన్ ,నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉండగా.. ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉన్నందున.. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా తిరుగుతుంది. వారానికోసారి పోర్ట్‌బ్లెయిర్‌కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉండగా.. ఆ తేదీ సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు.ఇదిలా ఉంటే పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్‌లో అది ల్యాండ్ కాకపోగా…బయల్దేరిన 15ని.లకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో దీనికి సంబంధాలు తెగిపోయాయి. బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధృవీకరించుకున్నారు..
అదృశ్యమైన విమానం కోసం భారత్ తీవ్రంగా వెతికింది. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేదు.. సెప్టెంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదని లేఖలు రాసింది వైమాణిక శాఖ. ఆ విదంగా విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అప్పుడు భావించారు.
విమానం కోసం ఐదు యుద్ధనౌకలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం రంగంలోకి దిగాయి… వీటితో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు అధికారులు. అయితే విమాన జాడను గుర్తించేందుకు ఉపయోగపడే పరికరాలను ఎయిర్‌క్రాఫ్ట్ మోసుకెళ్లలేదనే విషయం దర్యాప్తులో తెలిసింది. దీంతో సెర్చ్ ఆపరేషన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీంతో ఎయిర్‌క్రాఫ్ట్ కోసం భారత్ జరిపిన అతిపెద్ద గాలింపు చర్యగా మిగిలిపోయింది ఈ ఆపరేషన్..