పొలం దున్నుతుండగా రైతుకి కనిపించిన వింత వస్తువు..ఏంటో తెలిస్తే షాక్..!
శాసనాలు చరిత్రకు ఆనవాళ్లు గా నిలుస్తాయనటంలో సందేహం లేదు.. ఆ కాలంలో రాజులు, రాయించిన శాసనాలు మన చరిత్ర, సమాజం, సంస్కృతికి సాక్షాత్కారం ఇస్తాయి. క్రీస్తు శకం ప్రారంభంలో ఎక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో..తెలియ చెప్పేందుకు ఇవి ఉపయోగపడతాయి.
ప్రత్యేకంగా గ్రంధస్థం చేసే వ్యవస్థలేని సమయంలో ఈ శాసనాలే ఆనాటి చరిత్రకు ఆనవాళ్లగా గుర్తించాలి. అలాంటి చరిత్రకు ఆనవాళ్లుగా భావించే శాసనాలు ఏపీలో అక్కడక్కడా తెలుగు లిపిలో బయటపడుతున్నాయ్. అలాంటి వాటిలో తాజాగా తెలుగు శాసనం బయటపడింది. ప్రకాశం జిల్లా బాపనపల్లిలో ఎనిమిదవ శతాబ్దం నాటి తెలుగు శాసనం ఒకటి పొలాల్లో కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే..ఏపీలో 8శతాబ్ధం నాటి తెలుగు శాసనం లభ్యమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బాపనపల్లి సమీపంలో పొలాల్లో ఓ రాయి రైతులకు కంట పడింది. అయితే దానిపై తెలుగు అక్షరాలు లిఖించి ఉండటంతో ఏదో గుప్తనిధికి సంబంధించిన వివరాలు ఉన్నాయని ఆసక్తితో స్థానికులు చరిత్ర పరిశోధకుడికి సమాచారం అందించారు. దీనిని పరిశీలించిన ఆయన వీటి ఫోటోలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కు పంపించారు. దీన్ని పరిశీలించిన వారు ఈ రాతిపై లిఖించింది శాసనంగా గుర్తించారు. 8 నుండి 9 శతాబ్దాల కాలంలో ఈ శాసనంపై లిఖించినట్టుగా భావిస్తున్నారు వారు. దీనిపై ఎనిమిదవ శతాబ్దపు కాలం నాటి తెలుగు అక్షరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ శాసనంలో మకరద్వజ అను బిరుదును కలిగిన శ్రీ త్రిపురాంతకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు రాయించినట్టుగా తెలుస్తోంది. కైలాస భగవంతుడిగా కీర్తించబడిన శ్రీ ఉమరవెయిధీశ్వర దేవుడికి దండియమ్మ అను ఆమె పన్నాస అనే భూమిని, ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది.
బాపనపల్లికి సమీపంలో అయ్యంబొట్లపల్లి గ్రామంలో రామలింగేశ్వరస్వామివారి గుడిలో కూడా ఇలాంటి అక్షరాలతో కూడిన శాసనం ఉంది. అంతే కాదు గోళ్ళవిడిపిలో గ్రామంలో కూడా ఇదే తరహా లిపితో ఉన్న మరో శాసనం కూడా గతంలో బయటపడినట్టు తెలుస్తోంది. మన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వరకు శాసనాలను ప్రాకృతంలో, ఐదవ శతాబ్దంలో సంస్కృతంలో రాసేవారు.. ఆ తరువాత రేనాటి చోళుల కాలంలో తెలుగులో శాసనాలు రాయటం ప్రారంభమైంది.