ఆడవేషంలో పరీక్ష రాయటానికి వచ్చిన అమ్మాయి బాయ్-ఫ్రెండ్..చివరికి ఏం జరిగిందో తెలుసా..?
సినిమాల్లో హీరోయిన్ కోసమో..లేక ఎవరైనా అమ్మాయి కోసమో.. ఆడవేషం వేసుకుని వచ్చి హీరోలు పరీక్ష రాయడం లాంటివి మనం చూస్తుంటాము. అయితే ఇప్పుడు రియల్ లైఫ్లో ఇలాంటి సంఘటనే జరిగింది.ఇలాంటి సినిమా సీన్లో హ్యాపీ ఎండింగ్ ఉంటది.. కానీ నిజజీవితంలో అలా కాదు..అలా చేసి అడ్డంగా దొరికాడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్.. చివరికి ఊచలు లెక్కపెట్టాడు. పంజాబ్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
పంజాబ్లోని ఫరీద్కోట్ బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో జనవరి 7వ తేదీన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు పరమ్జీత్ కౌర్ అనే యువతి దరఖాస్తు చేసింది. అయితే ఆ ఎగ్జామ్ రాసేందుకు ఆమె స్థానంలో బాయ్ ఫ్రెండ్ అంగ్రేజ్ సింగ్ ఆడ వేషంలో వెళ్ళాడు. తనను ఎవరూ గుర్తుపట్టకూడదని అమ్మాయిల మాదిరిగా డ్రెస్, బొట్టు, గాజులు, లిప్స్టిక్ పెట్టుకుని రెడీ అవ్వటమే కాదు..తానే పరమ్జీత్ అని నమ్మించేందుకు ఏకంగా అదే గెటప్ లో ఫోటో దిగిన నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా తయారు చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా..బయోమెట్రిక్ వేసే దగ్గర అడ్డంగా దొరికిపోయాడు సదరు అతితెలివి బాయ్ ఫ్రెండ్. దరఖాస్తు సమయంలో వేసిన వేలిముద్రలతో ఇవి మ్యాచ్ కాకపోవడంతో.. యూనివర్సిటీ అధికారులు ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది.పరీక్ష రాసేందుకు వచ్చింది అమ్మాయి కాదు.. అబ్బాయి అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. చివరికి అతడ్ని పోలీసులకు అప్పగించారు యూనివర్సిటీ అధికారులు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.