హోలీలో రంగులు చల్లుకునే వారికి షాకింగ్ న్యూస్..!
హోలీ పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రంగులు జల్లుకోవటం. ఈ పండుగ సమయంలో బంధువులు, స్నేహితులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొనే ఆచారం అనాదిగా వస్తోంది..దీనికి అందరూ ఆనందంగా సెలెబ్రేట్ చేసుకుంటారు.అయితే కెమికల్స్ తో కూడిన ఈ రంగులను మొహం, చర్మం పై పూసుకోవడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు షాకింగ్ విషయాలను చెప్తున్నారు. అసలు రంగుల్లోని కెమికల్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటీ అనే విషయానికెళ్తే..!
కెమికల్ కంపోజిషన్..
సాధారణంగా హోలీలో వాడే రంగుల్లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఈ కెమికల్స్ లో మెర్క్యురీ, క్రోమియం, లెడ్ వంటి విషపూరితమైన లోహాలు ఉండటం వల్ల ఇవి మనుషుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇలాంటి రంగులు పూయడం ద్వారా చర్మం పై చికాకు, అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి.
కంటి సమస్యలు..
హొలీ రంగుల్లో ఉండే హానికరమైన రసాయనాల వల్ల చర్మం పై దద్దుర్లు, చికాకు, దురదతో పాటు… ముఖ్యంగా సున్నితమైన చర్మం కలిగిన వారికి ఇవి మరీ ప్రమాదకరంగా మారతాయి. అంతేకాదు ఈ రంగులు కళ్ళల్లో పడినప్పుడు కళ్ళలో మంట, ఎరుపుగా మారడం కొన్ని సందర్భాల్లో కంటి పొర పూర్తిగా దెబ్బతినడంతో పాటు కొన్ని సందర్భాల్లో కళ్ళు పూర్తిగా కోల్పోయిన సందర్భాలు లేకపోలేదు.
ఊపిరితిత్తుల సమస్య..
సహజంగా హొలీ సమయంలో పొడి రంగులు వాడడం వల్ల అవి గాలిలో చేరి సూక్ష్మ కణాలుగా మారటంతో ఈ రంగులతో కూడిన గాలిని పీల్చడం ద్వారా శ్వాసకోశం లో ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు, తుమ్ములు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడతాయి. ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.
వీటివల్ల పర్యావరణానికి సైతం..?
ఈ రంగుల్లోని కెమికల్స్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా హానికరం అని చెప్పవచ్చు. చర్మం పై ఉన్న ఈ రంగులను కడిగినప్పుడు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కాలువల్లో కలవటం వల్ల ఇది నీటి కాలుష్యానికి దారితీస్తుంది. అంతే కాదు దీని వల్ల జల జీవనానికి కూడా హాని జరుగుతోంది.ఈ రంగుల నుంచి కలిగే ఎఫెక్ట్స్ లను తగ్గించడానికి సహజ ఉత్పత్తులతో తయారు చేసిన రంగులను ఎంచుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు పసుపు, బీట్ రూట్, బచ్చలికూర వంటి మొక్కల ఆధారిత వనరులతో చేసిన రంగులను వాడితే వీటి నుండి వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించవచ్చని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి రెండింటికీ మంచిది అంటున్నారు.