అప్పుడాయన చేసిన ఒక తప్పు ఇప్పుడు ఇన్ఫోసిస్ ను పుట్టించింది..!
విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ చేసిన ఒక తప్పు..దేశంలో ప్రస్తుత అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని మీకు తెలుసా? అప్పుడు అజీమ్ ప్రేమ్ జీ ఆ తప్పు చేయకుండా ఉండిఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదట.ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి..? స్వయానా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) చెప్పిన ఆ విషయాల గురించి తెలుసుకుందాం..!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో ఇండియా గణనీయ అభివృద్ధి సాధించిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిదనే చెప్పవచ్చు. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన 7మందిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారనే చెప్పాలి.
ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తికి, విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల చెప్పారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్‌జీ తనతో ఒకసారి అన్నారట..ఓ నేషనల్ మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు నారాయణ మూర్తి. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని, నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో అన్నారు.
నారాయణ మూర్తి 1981-2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002-2006 వరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్‌గా కూడా కొనసాగారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు నారాయణ మూర్తి. నారాయణ మూర్తి ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్ గా ఉన్నారు.