రబీకి అనువైన నువ్వుల రకాలతో అధిక దిగుబడులు..ఇలా చేయండి..!
నీటి వసతి వున్న రైతాంగం రబీ పంటగా నువ్వుల సాగు చేపట్టి మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు బాగుంటాయి.అయితే రైతు విత్తన ఎంపికతో పాటు, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వుల దిగుబడి ఆధారపడి వుంటుందని శాస్త్రవేతలు చెప్తున్నారు. రబీ నువ్వుల సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలుసుకుందాం.
రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వుల పంట. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు విపరీతంగా పెరుగుతోంది. నువ్వుల గింజల్లో నూనె శాతం 45 నుండి 55 వరకు , ప్రొటీన్ల శాతం 25 వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2 నుండి 3 నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వుల పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు పొందుతున్నారు.
నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ వుండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతోంది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా , రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి జనవరి మూడవ వారం వరకు నువ్వులు విత్తటం ఆనవాయితీగా వస్తోంది.
నువ్వుసాగు ఎలా చేయాలి..?
వేసవిలో పండిన నువ్వులలో విత్తన నాణ్యత ఎక్కువగా వుంటుంది. నువ్వుల పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలం. ప్రస్థుతం మార్కెట్లో తెల్ల నువ్వుల రకాలు క్వింటా 8 వేల నుండి 9వేల వరకు ధర పలుకుతున్నాయి. ఎకరాకు 5-6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వుల సాగు రైతులకు అత్యంత లాభదాయకం గా మారింది. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే ఆశించినంత దిగుబడిని పొందవచ్చు.
నువ్వుల సాగులో కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు మొక్కలు ప్రధాన పంటకంటే ఎత్తు పెరగకుండా చూసుకోవాలి. నువ్వులు నూనెజాతి పంట కాబట్టి అధికంగా సల్ఫర్ అందేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనలను అనుసరించి సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లైతే మంచి దిగుబడులు పొందవచ్చు. నువ్వుల పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తాయి. ముఖ్యంగా తొలిదశలో బీహారి గొంగళిపురగు, పొగాకు లద్దెపురుగు సోకి నష్టం కలిగిస్తాయి.లేతమొగ్గదశలో కోడుఈగతో పాటు తెగుళ్ళు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గవచ్చు..కాబట్టి సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు తీసుకోవాలి. సాధారణంగా నువ్వులలో ఎకరాకు 5-6 క్వింటాల దిగుబడిని పొందవచ్చు . అయితే సకాలంలో సరైన నీటితడులు ఇచ్చి, రెండు దఫాలుగా నీటిలో కరిగే ఎరువులను పిచికారి చేస్తే ఎకరాకు 10-11 క్వింటాల వరకు దిగుబడులు తీసేందుకు అవకాశం లేక పోలేదు. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లైతే అధిక దిగుబడి పొంది రైతు లాభాల బాటలో పయనించవచ్చు..