ఎక్కడైనా సరే తగ్గేదేలే.. చంద్రకళ ఐఏఎస్ విజయగాధ..!
బిడ్డ బానోత్ చంద్రకళ.. ఈమె మన తెలుగు బిడ్డే..యూపీలోని బులంద్ శహర్‌ని పాలించిన గడసున్న ఐఏఎస్. ఆలోచన, ఆశయం ఉన్నతమైనదైనప్పుడు…లక్ష్యంమే సాధన అయినప్పడు కీర్తి కిరీటంగా మారుతుంది.
బానోత్ చంద్రకళ, ఐఏఎస్…ఈమె మన తెలుగింటి ఆడ పడుచు. కరీంనగర్ జిల్లాలో పుట్టి,ఉత్తర ప్రదేశ్ అవినీతిపరుల గుండెల్లో సింహ స్వప్నంగా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి మగవాళ్లు కూడా భయపడతారు. కానీ 38 ఏళ్ల చంద్రకళ 10ఏళ్లుగా అక్కడ నెగ్గుకు వచ్చింది. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలోనూ నిజాయితీ కలిగిన మంచి చురుకైన అధికారినిగా గుర్తింపు తెచ్చుకుంది చంద్రకళ. యోగి ఆదిత్యనాథ్ హయాంలోనూ అదే గౌరవాన్ని అందుకుంది. ఐఏఎస్ కావడానికి చంద్రకళ పుట్టిల్లు వడ్డించిన విస్తర అనుకుంటే పొరబాటే..ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చింది చంద్రకళ. ఒక్కొక్క మెట్టునూ అధిరోహిస్తూ విజయాన్ని తన దగ్గరకు తెచ్చుకున్న మట్టిలో మాణిక్యం.
చంద్రకల కుటుంబ నేపథ్యం ఏంటంటే..?
కరీంనగర్ జిల్లా, ఎల్లారెడ్డి మండలం, గర్జన పల్లి గ్రామం ఈమెది. పెద్దగా సౌకర్యాల్లేని లంబాడా తండాలో పుట్టింది.తండ్రి కిషన్ రామగుండం ఎరువుల కంపెనీలో ఫ్లోర్మెన్. మొత్తం నలుగురు పిల్లలు, అన్న రఘువీర్, తమ్ముడు మహావీర్, చెల్లెలు మీనా.
చదువు ఎలా కొనసాగిందంటే..?
చంద్రకళ తల్లి లక్ష్మికి పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనే ఓ ఘడమైన కల ఉండేది. పాఠశాల విద్యను రామగుండంలోనే అభ్యసించిన ఆమె డిగ్రీ, పీజీలను హైదరాబాద్‌లో పూర్తి చేసింది. కానీ కోఠీ ఉమెన్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే ఈమెకు పెళ్లి చేశారు. పెళ్లి తరవాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో ఎం.ఏ పట్టా అందుకుంది చంద్రకళ.
ఆమె భర్త ఎ.రాములు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తారు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె కూడా ఉంది.
ఈమె గ్రూప్-1లో టాపర్..!
గ్రూప్-1 సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది చంద్రకళ. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరవాత ప్రతి అడుగునూ ఒక చాలెంజ్‌గానే తీసుకుంది. ఒక సవాల్‌ని ఎదుర్కొంటున్నట్లు ప్రిపేర్ అయింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఎస్సీ-ఎస్టీ కేటగిరీలో ఈమె టాపర్‌గా నిలిచింది.
సివిల్ సర్వీసెస్ విషయానికోస్తే..
సివిల్ సర్వీసెస్‌లో 2008లో 409వ ర్యాంకుతో ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా నియామకం జరిగింది.లక్ష్మి నలుగురు పిల్లల్లో అత్యున్నత స్థాయికి చేరిన కూతురు చంద్రకళ. ఈ సంతోషం లక్ష్మికి మాత్రమే కాదు చుట్టుపక్కల అనేక లంబాడా తండాల జనాలకు సంతోషంగా మారింది..తమింటి బిడ్డే అన్నంతగా అందరు సంతోషించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బులంద్ శహర్, బిజౌర్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో పనిచేసింది చంద్రకళ.కలెక్టర్‌గా బాధ్యతల నిర్వహణలో రాజీపడని అధికారిగా, హార్డ్ వర్కర్ అనే గుర్తింపు వచ్చింది.
ఏదన్నా అనుకుంటే ఎక్కడా తగ్గేదేలే..!
ప్రయాణానికి గమ్యం,జీవితానికి లక్ష్యం ఉండాలి. గమ్యం లేని ప్రయాణానికి, లక్ష్యం లేని జీవితానికీ అర్థం లేదు. అందుకు చంద్రకళ ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లల్ని పెద్ద హోదాల్లో చూడాలనే తపన తప్ప ఏం చదివించాలో తెలియని అమాయకత్వం తన తల్లి లక్ష్మిది. మార్గదర్శనం చేసేవాళ్లు లేకపోవడంతో కొంతకాలం తడబాట్లతో సాగింది చంద్రకళ జర్నీ. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే… లక్ష్యం అంటూ స్థిరంగా ఏర్పరుచుకోక ముందు కూడా ప్రయాణం ఆపలేదామె. తనకు ఇష్టమైన కోర్సులో కొనసాగింది. మెదడులో ఒకసారి కెరీర్ అనే బీజం పడిన తర్వాత ఇక వెనక్కి చూసుకోలేదామే. అందరిలో ఒకరిగా కాదు, 10మందిలో గౌరవం అందుకునే బాధ్యతాయుతమైన హోదాలో జీవించాలనే కోరిక ఆమె బుర్రలో పడిన తర్వాత ఆమెకు ఏదీ కష్టంగా అనిపించలేదు. గర్భిణిగా బిడ్డను మోస్తున్నప్పుడు కానీ, బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె ఎక్కడా విరామం తీసుకోలేదు.
చంద్రకళకు దక్కిన అరుదైన గౌరవం..!
సమర్థత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ బిడ్డ, ఐఏఎస్ అధికారి బి.చంద్రకళకు అరుదైన గౌరవం లభించింది.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్న ఈమెకు ప్రధాని మోదీ డ్రీమ్ టీమ్‌లో చోటు లభించింది.నిజాయతీ గల ఆఫీసర్ అన్న పేరు తెచ్చుకున్న చంద్రకళకు ప్రధాని మోదీ అరుదైన గుర్తింపు బహుకరించారు. చంద్రకళను మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్‌గా నియమించి,కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖలో ఆమెకు ఉప కార్యదర్శి బాధత్యలను ఇచ్చారు. బులందర్‌షెహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా కార్యక్రమం అమలు కోసం ఆమె బాగా ప్రచార చేశారు.