అలా జరిగితే అయోధ్య రామాలయంలో దుష్టశక్తులు ప్రవేశిస్తాయంటున్న అద్వైత మఠాధిపతులు..?
రాబోయే వారం రోజుల్లో అయోధ్య రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో మరో వివాదం తలెత్తింది. దేశంలోని 4 అద్వైత మఠాలకు చెందిన అధిపతులు రామ మందిర పునఃప్రతిష్టకు హాజరు కావడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ శుభ కార్యం జరగడాన్ని దేశం నలువైపులా ఉన్న 4 మఠాలకు చెందిన శంకరాచార్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. శాస్త్రం ప్రకారం ప్రాణ ప్రతిష్ట జరగడం లేదని, ప్రధాని మోడీ గర్భగుడిలో ప్రవేశించడం సరి కాదని మఠాధిపతులు ఆక్షేపిస్తున్నారు.
గోవర్ధన పీఠం-జ్యోతిర్మఠాలకు చెందిన నిశ్చలానందస్వామి సరస్వతి, అవిముక్తేశ్వరానందర సరస్వతి ప్రతిష్ట జరుగుతున్న తీరుపై అసంతృప్తి తెలియజేసారు. వైదిక సిద్ధాంతాల ప్రకారం రాముడు కొలువు తీరాలని వారు అంటున్నారు. అలా కాని పక్షంలో విగ్రహ ప్రభావం క్షీణించటంతో పాటు, దుష్ట శక్తులు గర్బాలయంలో ప్రవేశిస్తాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వారక, శృంగేరిలో ఉన్న శారదా పీఠాలకు చెందిన అధిపతులు సదానంద సరస్వతి, భారతీ తీర్థ స్వామి మాత్రం ఈ ప్రాణ ప్రతిష్టపై ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. వాళ్లు కూడా ప్రతిష్టకు హాజరయ్యే అవకాశాలు లేనట్లు సమాచారం.
ఈ విషయంపై రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. రామాలయ ప్రారంభోత్సవాన్ని భాజపా తన పార్టీ కార్యక్రమంగా మార్చేసిందని, అందుకే మత పెద్దలు కూడా హాజరు కావడం లేదని ఆరోపించాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ విషయంపై భాజపా తరఫున కేంద్ర మంత్రి నారాయణ రాణే మాత్రం ‘ఇప్పటి వరకూ ఎవరూ చేయలేని పనిని మోదీ చేసి చూపారు, దీనికి ఆయనను ఆశీర్వదిస్తారో, శపిస్తారో శంకరాచార్యుల ఇష్టం’ అని అన్నారు. మొత్తం మీద శంకరాచార్యుల గైర్హాజరు ఓ పెద్ద చర్చకు తెరతీస్తోంది.